China: కొవిడ్ విలయతాండవం... చైనాలో దారుణ పరిస్థితులు!
- ఈ నెల 7 తర్వాత చైనాలో కరోనా ఆంక్షల ఎత్తివేత
- ఒక్కసారిగా ప్రబలిన వైరస్ మహమ్మారి
- నిత్యం లక్షల్లో కేసులు, వేలాదిగా మరణాలు
- ఈ మేరకు పాశ్చాత్య మీడియాలో కథనాలు
- గత వారం రోజుల్లో ఒక్క మరణమే సంభవించిందన్న చైనా
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 చైనాలో మృత్యుఘంటికలు మోగిస్తోందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ వెల్లడించారు. చైనాలో కరోనా మృతుల శవాలతో ఆసుపత్రుల్లో మార్చురీలు నిండిపోయాయని, అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద మృతదేహాలతో ప్రజలు బారులు తీరిన పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ మేరకు ఆయన కొన్ని వీడియోలు విడుదల చేశారు. ఆయన చెప్పిన వివరాలన్నింటినీ వీడియోలు బలపరుస్తున్నాయి.
కాగా, చైనా ప్రభుత్వం మాత్రం గత వారం రోజుల వ్యవధిలో కరోనాతో ఒక్క మరణం మాత్రమే సంభవించిందని చెబుతోంది. చైనాలో ఈ నెల 7 తర్వాత కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత వైరస్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోయి లక్షల కేసులు వస్తున్నాయని, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని పాశ్చాత్య దేశాల మీడియా చెబుతోంది. 2023 డిసెంబరు నాటికి చైనాలో కరోనా మరణాల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చైనా అధికారిక లెక్కల ప్రకారం ఈ మూడేళ్లలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,241 మాత్రమే. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో అక్కడి పరిస్థితులను చూస్తుంటే, చైనా చెబుతున్న గణాంకాలపై సందేహాలు కలుగుతున్నాయి.