Sushant Singh Rajput: మళ్లీ కలకలం రేపుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ఘటన.. ఆయనది హత్యేనంటున్న మార్చురీ సహాయకుడు!
- సుశాంత్‌ది కచ్చితంగా హత్యేనంటున్న పోస్టుమార్టం సహాయకుడు రూప్ కుమార్ షా
- ఆయన శరీరంపైనా, మెడపైనా గాయాలు చూశానని వెల్లడి
- పోస్టుమార్టం సందర్భంగా వీడియో కాకుండా ఫొటోలు తీయమంటూ ఆదేశాలు వచ్చాయన్న షా
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించి రెండేళ్లు దాటింది. ఆయన మరణంపై ఇప్పటికీ అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. అయితే, పోలీసులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కూపర్ ఆసుపత్రిలో సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన బృందంలోని ఓ సహాయకుడు రూప్ కుమార్ షా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని పేర్కొన్నారు.
‘టీవీ9’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రూప్ కుమార్ షా మాట్లాడుతూ.. సుశాంత్ కుమార్ మరణించిన రోజున పోస్టుమార్టం కోసం కూపర్ ఆసుపత్రికి ఐదు మృతదేహాలు వచ్చాయన్నారు. తాము పోస్టుమార్టం కోసం వెళ్లినప్పుడు ఆ ఐదు మృతదేహాల్లో ఒకటి బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌దని గుర్తించామన్నారు. ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని, మెడపైనా రెండుమూడు ఉన్నట్టు గుర్తించామన్నారు.
నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేస్తుండగా వీడియో తీయాల్సి ఉంటుందని అయితే, పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఫొటోలు మాత్రమే తీశామని ఆయన పేర్కొన్నారు. సుశాంత్‌ను చూడగానే ఆయన శరీరంపై ఉన్న గుర్తులను బట్టి అది హత్యేనని సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినట్టు రూప్ కుమార్ షా పేర్కొన్నారు. నిబంధనల మేరకు పోస్టుమార్టం పూర్తి చేయాలి కదా అని అడిగితే, ఫొటోలు మాత్రమే తీయాలని, వీలైనంత త్వరగా మృతదేహాన్ని అప్పగించాలని సీనియర్లు ఆదేశించారని గుర్తు చేసుకున్నారు. దీంతో రాత్రి సమయంలో పోస్టుమార్టం చేయాల్సి వచ్చిందన్నారు.