CPI Ramakrishna: ముందే ఎన్నికలంటే.. జగన్ పదవి ముందే పోతుంది: సీపీఐ రామకృష్ణ
- బెయిల్ పై విడుదలైన ఎమ్మెల్సీకి సన్మానం చేయడమేంటన్న రామకృష్ణ
- నిరసనలు తెలపకుండా పోలీసులను కాపలా పెట్టడంపై ధ్వజమెత్తిన రామకృష్ణ
- ప్రజాస్వామ్య హక్కుల కోసం అంతా కలిసి పోరాడాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు ముందస్తు ఎన్నికలకు పోతే.. ఆయన ముఖ్యమంత్రి పదవి ముందే ఊడిపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి జగన్ ముందే పదవి కోల్పోతే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. పరదాలు కట్టుకుని పర్యటించే ముఖ్యమంత్రి జగన్.. పదవి పోతే బురఖా కప్పుకుని పోతారంటూ రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ రూపంలోనూ నిరసన జరగకుండా ముఖ్యమంత్రి జగన్ పోలీసులను కాపలా పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం అంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఓ దళితుడిని హత్య చేసి, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఇచ్చిన నేతకు వైసీపీ మద్దతు పలకడం దుర్మార్గమని రామకృష్ణ చెప్పారు. సదరు ఎమ్మెల్సీకి బుద్ధి చెప్పాల్సింది పోయి.. ఆయన చిత్ర పటానికి క్షీరాభిషేకాలు చేయడమేంటని మండిపడ్డారు. మర్డర్ కేసులో జైలుకెళ్లిన ఎమ్మెల్సీ.. బెయిల్ పై విడుదలైతే సన్మానం చేయడమేంటని ప్రశ్నించారు. ఈ చర్యల ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారని రామకృష్ణ వైసీపీ నేతలను ప్రశ్నించారు. అధికార పార్టీకి లొంగిపోయిన పోలీసులు.. వ్యవస్థ పరువు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు.