TDP: టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలో అఖిలపక్ష సమావేశం... హాజరైన వివిధ పార్టీల నేతలు
- 'ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ' పేరిట భేటీ
- జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్న అచ్చెన్న
- ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చిన వామపక్ష నేతలు
టీడీపీ ఆధ్వర్యంలో నేడు విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అధ్యక్షతన 'ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ' పేరిట జరిగిన ఈ భేటీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జనసేన తరఫున కందుల దుర్గేశ్, కాంగ్రెస్ తరఫున నరసింహారావు హాజరయ్యారు.
ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఒక్క చాన్స్ అని కోరితే ప్రజలు వైసీపీకి అవకాశం ఇచ్చారని, కానీ సీఎం జగన్ వ్యవస్థలన్నింటిని తన గుప్పెట్లో పెట్టుకున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే, పోలీసులు అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కేసులు పెట్టినా భయపడేది లేదని, జైళ్లకు వెళ్లినా ప్రజల కోసం పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు స్పందిస్తూ, వైసీపీ అరాచకాలకు ఉమ్మడి పోరాటాలతో అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. ధర్నాలు చేస్తేనే భయపడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే నోటీసులు ఇస్తారని స్పష్టం చేశారు.