KTR: కిషన్ రెడ్డి సంబరాలకు కారణం ఏంటి?: కేటీఆర్
- సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
- కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
- కిషన్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారన్న కేటీఆర్
- దర్యాప్తు బాధ్యతలు జేబు సంస్థకు చిక్కాయన్న ఆనందమా? అంటూ వ్యాఖ్యలు
సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు బాధ్యతలను హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసు విచారణ వారి జేబు సంస్థ సీబీఐకి చిక్కిందన్న ఆనందంతో కిషన్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవారని, ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా మారిందని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కేసును సీబీఐకి అప్పగిస్తే నిందితులు హడలిపోయేవారని, కానీ ఇప్పుడు సీబీఐకి కేసు అప్పగిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, బీజేపీ హయాంలో సీబీఐ పరిస్థితి ఎలా తయారైందో దీన్నిబట్టే తెలుస్తోందని కేటీఆర్ విమర్శించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులైన స్వామీజీలతో తమకు సంబంధం లేదన్నవారు, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ నిలదీశారు. ఇప్పటిదాకా కలుగులో దాగిన ఎలుకలు నిదానంగా బయటికి వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ పరీక్షలు చేస్తే బీజేపీతో లింకులు బయటపడతాయని, దీనికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.