jail warden: యూపీలో జైలు వార్డెన్ ను చితకబాదిన తోటి ఉద్యోగులు.. వీడియో ఇదిగో
- రాయ్ బరేలీలోని జిల్లా జైలులో సంఘటన
- మెస్ లో మంచి భోజనం పెట్టడమే కారణమట!
- ఆయన వల్ల తమ క్యాంటీన్ బిజినెస్ దెబ్బతిందని ఆరోపణ
- ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
జైలులో భోజనం బాగుండట్లేదని ఖైదీలు ఆందోళన చేయడం అప్పుడప్పుడూ వార్తల్లో చూస్తుంటాం.. ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఖైదీలకు మంచి భోజనం పెడుతున్నాడనే కారణంగా తోటి ఉద్యోగిపైనే దాడి చేశారు జైలు సిబ్బంది. మెస్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న ఉద్యోగిని రౌండప్ చేసి, లాఠీలతో చితకబాదారు. ఇదంతా మిగతా సిబ్బంది వీడియో తీశారు. అది కాస్తా లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాయ్ బరేలీలోని జిల్లా జైలులో జరిగిందీ సంఘటన. ఈ జైలులో మెస్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న ముఖేష్ దూబేపై తోటి ఉద్యోగులే దాడి చేశారు. మెస్ లో మంచి భోజనం పెట్టడం వల్ల తమ క్యాంటీన్ బిజినెస్ దెబ్బతింటోందని వారు ఆరోపిస్తున్నారు. జైలు లోపల దూబేను చుట్టుముట్టిన ముగ్గురు తోటి ఉద్యోగులు.. లాఠీలతో చితకబాదారు. మరో ఇద్దరు కొలీగ్స్ పక్కకు నిలబడి ఈ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకురావడంతో ఉన్నతాధికారులు స్పందించి, ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ముఖేష్ దూబేను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.