Rahul Gandhi: రాహుల్ గాంధీకి నచ్చే బైక్ ఏంటో తెలుసా?
- అప్రీలియా ఆర్ఎస్ 250 అంటే ఇష్టమన్న రాహుల్
- రాయల్ ఎన్ ఫీల్డ్ నచ్చదన్న కాంగ్రెస్ ఎంపీ
- దీనికి బదులు ఆర్డీ 350 బాగుంటుందన్న అభిప్రాయం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బైక్ లపై తన ఇష్టాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. తనకు కారు లేదని, కార్లంటే ఇష్టం లేదని స్పష్టం చేశారు. తన తల్లి సోనియాగాంధీకి కారు ఉందని, దాన్ని తాను డ్రైవ్ చేస్తుంటానని చెప్పారు. కార్లంటే తనకు ఆసక్తి లేదు కానీ, డ్రైవింగ్ అంటే ఇష్టమన్నారు. తనకు ఓ మోటార్ బైక్ ఉన్నట్టు చెప్పారు.
‘‘లండన్ లో పనిచేసే సమయంలో నేను వినియోగించిన అప్రీలియా ఆర్ఎస్ 250 అంటే నాకు చాలా ఇష్టం’’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఓల్డ్ లాంబ్రెట్టా (చేతక్ లాంటి స్కూటర్) ఎంతో అందంగా ఉంటుందని, ఆర్1 కూడా అంతేనన్నారు. లాంబ్రెట్టా అందంగా ఉండడమే కాదు, దాన్ని నడపడానికి ఎక్కువ శక్తి కావాలని.. చాలా ప్రమాదకరం కూడా అని వివరించారు.
ఢిల్లీ రోడ్లపై డ్రైవింగ్ చాలా ప్రమాదకరమని రాహుల్ చెప్పారు. తాను సైక్లింగ్ కే ప్రాధాన్యం ఇస్తానని, తన శక్తిని ఖర్చు చేయడాన్ని ఇష్టపడతానని పేర్కొన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే తనకు నచ్చదన్నారు. అయితే, ఎన్ ఫీల్డ్ బ్యాలన్స్, బ్రేకింగ్ ను (కంట్రోల్) చాలా మందికి నచ్చుతుందని చెప్పారు. దీనికి బదులు ఆర్డీ 350ని తాను ఇష్టపడతానని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి పునాది కావాలని, ఆ విషయంలో భారత్ చాలా దూరంలోనే ఉందన్నారు.