TPCC President: వ్యక్తిగత అంశాలపై బహిరంగ చర్చలొద్దు.. పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచన
- ప్రజా సమస్యలపైనే చర్చ జరగాలన్న టీపీసీసీ అధ్యక్షుడు
- గాంధీ భవన్ లో కాంగ్రెస్ 138వ ఆవిర్భావ వేడుకలు
- వేడుకలకు హాజరుకాని సీనియర్లు
- ప్రజల కోసం కొట్లాడాలని కార్యకర్తలకు రేవంత్ పిలుపు
పార్టీలో వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టి ప్రజల కోసం, ప్రజా సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వమేమో బ్రిటిష్ పాలకుల విధానాలను ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితిలో మనకున్న సమస్యలను పక్కన పెట్టి ప్రజల కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతర్గత సమస్యలపై బహిరంగ వేదికల మీద చర్చించొద్దని పార్టీ నేతలకు సూచించారు.
గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టకుండా బీజేపీ అడ్డుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ, విద్యాహక్కు, సమాచార హక్కు చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కోసం దర్యాఫ్తు సంస్థలను వాడుకుంటున్నాయని, ప్రతిపక్ష నేతలను వేధించేందుకు ఉపయోగించుకుంటున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అయిన వాళ్లేనని తెలిపారు.
పార్టీ మారిన వెంటనే వాళ్లకు సీఎం కేసీఆర్ మంచి పదవులు కట్టబెట్టారని, ఇది కూడా అవినీతి కిందికే వస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ జరిపించాలంటూ సీబీఐకి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. కాగా, రాహుల్ గాంధీ జోడో యాత్రకు కొనసాగింపుగా చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ నేతలు, కార్యకర్తలను రేవంత్ రెడ్డి కోరారు. అయితే, పార్టీ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరుకాలేదు.