TikTok: ప్రభుత్వ పరికరాల్లో టిక్ టాక్ వాడకంపై అమెరికా నిషేధం
- టిక్ టాక్ యాప్ పై అమెరికా అనుమానం
- నిఘా వేసే అవకాశాలున్నాయని భావిస్తున్న ప్రభుత్వం
- త్వరలోనే నిషేధం అమలు
చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై అమెరికా ప్రభుత్వం పరిమితస్థాయిలో నిషేధం విధించింది. ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ డివైస్ లలో టిక్ టాక్ యాప్ వినియోగంపై నిషేధం ప్రకటించింది. త్వరలోనే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలకు దీనిపై నియమావళిని కూడా విడుదల చేసింది.
అమెరికన్లపై నిఘా వేయడానికి చైనా టిక్ టాక్ యాప్ ను ఉపయోగించే అవకాశాలున్నాయని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే అమెరికాలోని 19 రాష్ట్రాలు ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో టిక్ టాక్ వాడకాన్ని నిషేధించాయి. టిక్ టాక్ యాప్ చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్థకు చెందినదన్న సంగతి తెలిసిందే.