Anil Deshmukh: అవినీతి కేసులో ‘మహా’ మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిలు
- అనిల్ దేశ్‌ముఖ్‌పై అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ సంచలన ఆరోపణలు
- బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతినెల రూ. 100 కోట్లు వసూలు చేయాలని ఆదేశించారన్న సీపీ పరంబీర్ సింగ్
- బెయిలు స్టే గడువును పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను కొట్టేసిన బాంబే హైకోర్టు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీబీఐ
అవినీతి కేసులో అరెస్టయి జైలుకెళ్లిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్ (73)కు కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో నిన్న సాయంత్రం 4.45 గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ముంబైలోని రెస్టారెంట్లు, బార్ల నుంచి ప్రతి నెల రూ. 100 కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనను ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గతేడాది చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తాజాగా బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇప్పటికే బెయిలుపై ఓసారి స్టే విధించిన న్యాయస్థానం.. స్టే గడువును మరోమారు పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను మంగళవారం తిరస్కరిస్తూ, మాజీ మంత్రికి బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆర్థర్ రోడ్డు జైలు నుంచి అనిల్ దేశ్‌ముఖ్ బయటకు వచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. కాగా, జైలు నుంచి బయటకు వచ్చిన దేశ్‌ముఖ్‌ను ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, సుప్రియా సూలె తదితరులు అక్కడే కలుసుకున్నారు. మరోవైపు, హైకోర్టు మంజూరు చేసిన బెయిులుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టులో ప్రస్తుతం సెలవులు ఉండడంతో వచ్చే ఏడాది జనవరిలో ఈ పిటిషన్ విచారణకు రానుంది.