Hyderabad: హైదరాబాద్ జేఎన్‌టీయూ భవనం పైనుంచి దూకి నెల్లూరు జిల్లా విద్యార్థిని ఆత్మహత్య
- జేఎన్‌టీయూలో సీఈసీ నాలుగో సంవత్సరం చదువుతున్న మేఘన
- ఏడాది కాలంగా మానసిక చికిత్స తీసుకుంటున్న విద్యార్థిని
- ఉదయం ఇంటర్నల్ పరీక్షలు రాసిన మేఘన
- మధ్యాహ్నం సెమిస్టర్ పరీక్ష రాయడానికి ముందు ఆత్మహత్య
హైదరాబాద్, కేపీహెచ్‌బీలోని జేఎన్‌టీయూ భవనం పైనుంచి దూకి నెల్లూరు జిల్లాకు చెందిన విదార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన ఇసానక మనోజ్‌రెడ్డి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. భార్య, కుమార్తె మేఘనారెడ్డి (21)తో కలిసి కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో ఉంటున్నారు. మేఘన జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ (సీఈసీ) నాలుగో సంవత్సరం చదువుతోంది.
నిన్న ఉదయం ఇంటర్నల్ పరీక్షలు రాసిన మేఘన మధ్యాహ్నం 2 గంటలకు చివరి ఏడాది సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షకు ఇంకా పావుగంట సమయం ఉందనగా క్యాంపస్ మైదానం పక్కనున్న నాలగంతస్తుల భవనంపైకి ఎక్కి దూకేసింది. వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఒత్తిడి వల్లే మేఘన ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఏడాది కాలంగా మానసిక చికిత్స తీసుకుంటున్నట్టు వైస్ ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి తెలిపారు. మేఘనను ఆమె తల్లి ఆరు నెలలుగా కారులో తీసుకొచ్చి దింపి, తరగతులు ముగిసేంత వరకు అక్కడే ఉండి కుమార్తెను తీసుకెళ్తున్నట్టు చెప్పారు. బుధవారం కూడా మధ్యాహ్నం 1.40 వరకు కుమార్తెతోనే ఉన్నారని, అన్నం తినిపించి పరీక్ష బాగా రాయాలని చెప్పి వెళ్లారని అన్నారు. ఆమె అటు వెళ్లగానే మేఘన భవనంపైకి ఎక్కి దూకేసినట్టు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.