china: చైనా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా నిర్ణయం
- నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందేనని వివరణ
- జనవరి 5 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి..
- అమెరికా దారిలోనే మరికొన్ని దేశాలు
కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా చాలా దేశాలు కోలుకోనేలేదు. ఇప్పుడిప్పుడే అంతా సద్దుమణుగుతుందని ఊపిరి పీల్చుకుంటుంటే చైనాలో మరోమారు వైరస్ విజృంభిస్తోంది. చైనాలో రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండడంపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో ప్రబలుతున్న కొత్త వేరియంట్ తమ దేశంలోకి ఎక్కడ అడుగుపెడుతుందోనని టెన్షన్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా నిబంధనల్లో అమెరికా మార్పులు చేసింది.
చైనా నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షను తప్పనిసరి చేసింది. వైరస్ లేదనే నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఫ్లైట్ ఎక్కడానికి రెండు రోజులలోపు కరోనా నెగెటివ్ రిపోర్టు ఉన్న వారినే అమెరికాలోకి అనుమతిస్తామని స్పష్టంచేసింది. ప్రయాణానికి పది రోజుల ముందు వైరస్ బారినపడి కోలుకున్న వారు.. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కు అదనంగా వైరస్ నుంచి కోలుకున్నట్లు డాక్టర్ సర్టిఫికెట్ చూపాలని పేర్కొంది. ఓవైపు దేశంలో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చైనా సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమెరికా అధికారులు వివరించారు.
చైనా విషయంలో అగ్రరాజ్యం అమెరికా నడిచిన బాటలోనే మరికొన్ని దేశాలు నడవనున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కరోనా ప్రొటోకాల్ కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. భారత్ కూడా చైనా నుంచి వచ్చే వాళ్లకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జపాన్, మలేసియా, తైవాన్ దేశాలు కూడా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేయనున్నాయి.