Social media: సోషల్ మీడియాలో గుట్టుగా పెయిడ్ ప్రమోషన్ ఇస్తే ఇకపై భారీ జరిమానా
- యూట్యూబ్ లేదా ఇన్ స్టా గ్రామ్ తదితర అన్ని వేదికలకూ వర్తింపు
- నిబంధనల ప్రకారం పెయిడ్ ప్రమోషన్ అని ముందే చెప్పాలి
- లేదంటే రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సిందే
యూట్యూబ్ చానళ్లు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ తదితర వేదికలపై వేలు, లక్షల మంది ఫాలోవర్లను కలిగి, ప్రముఖులుగా చలామణి అయ్యే వారిని కట్టడి చేస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సామాజిక మాధ్యమ చానళ్లపై పలుకుబడి కలిగిన కొందరు తమను అనుసరించే వారిని తప్పుదోవ పట్టించే కథనాలను విడుదల చేస్తుంటారు. డబ్బులు తీసుకుని వివిధ సంస్థలు, ఉత్పత్తులకు అనుకూల కథనాలను ప్రసారం చేస్తుంటారు. ఇకపై వీరు తాము చేసేది పెయిడ్ ప్రమోషన్ అని ముందే చెప్పి తీరాలి. లేదంటే రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
ఉదాహరణకు యూట్యూబ్ లో మిలియన్లు, కోట్ల మంది సబ్ స్క్రయిబర్లను కలిగిన చానళ్లు చాలానే ఉన్నాయి. వీరికి ఉన్న ఫాలోయింగ్ తో కొన్ని కంపెనీలు వీరిని సంప్రదించి తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలని కోరుతుంటాయి. వీరి ద్వారా ఎక్కువ మందిని చేరుకోవచ్చని, ఎక్కువ అమ్మకాలు చేసుకోవచ్చన్నది కంపెనీల యోచన. అందుకు కొంత ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. కానీ, తాము డబ్బులు తీసుకుని లేదా మరో ప్రయోజనం ఆశించి ఈ వీడియో చేస్తున్నామని చెప్పే వారు కొందరే ఉంటున్నారు. వీరిని సోషల్ మీడియాపై ప్రభావితం చేసే వారిగా పరిగణిస్తున్నారు. కానీ, ఇకపై ఇలా కుదరదు.
పెయిడ్ ప్రమోషన్ అని చెప్పకుండా వీడియోలు, పోస్ట్ లను పెట్టే వారిపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)కి ఫిర్యాదు చేయవచ్చు. విచారణ అనంతరం నిజమని తేలితే కనుక ఆయా వ్యక్తులు, చానళ్లపై రూ.50 లక్షల జరిమానా పడుతుంది. ఈ నెల 24 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నూతన నిబంధనలు కేవలం సోషల్ మీడియా చానళ్లకే కాకుండా, ఇతర సెలబ్రిటీలు, ఆర్థిక సలహాదారులు అందరికీ వర్తిస్తాయి.