Anam Ramanarayana Reddy: మరోసారి అసంతృప్తి గళం వినిపించిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
- గత ఎన్నికల్లో వెంకటగిరి స్థానంలో గెలిచిన ఆనం
- ఇదే సీటును ఆశిస్తున్న నేదురుమల్లి తనయుడు
- గతంలో మధ్యలోనే పారిపోయాడంటూ ఆనం వ్యంగ్యం
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అసంతృప్తి గళం వినిపించారు. ఏం పనులు చేశామని ప్రజలకు వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి? అంటూ నిన్న వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో సొంత పార్టీపై నిరసన వ్యాఖ్యలు చేసిన ఆనం... ఇవాళ కూడా అదే రీతిలో స్పందించారు.
తిరుపతి జిల్లా డక్కిలిలో వైసీపీ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేనో కాదో చెప్పండి అంటూ సమావేశానికి హాజరైన పార్టీ పరిశీలకుడ్ని అడిగారు. తాను ఎమ్మెల్యేనో కాదో అనే అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. లేకపోతే వెంకటగిరి అభ్యర్థిగా కొత్తవారిని ఎవరినైనా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిందా? అని ప్రశ్నించారు. కార్యకర్తల్లో కూడా ఇదే సందేహం ఉందని తెలిపారు. నియోజకవర్గంలో సమన్వయ లోపం ఉందని అన్నారు.
ఐదేళ్ల ప్రాతిపదికన వెంకటగిరి ప్రజలు తనకు ఓటేస్తే గెలిచానని, మరో సంవత్సరం పాటు తానే ఎమ్మెల్యేనని, కానీ ఓ పెద్దమనిషి అప్పుడే తాను ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. ఆ వ్యక్తి గతంలోనూ తానే ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం చేసుకుని సగంలోనే పారిపోయారని ఎద్దేవా చేశారు.
కాగా, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి వెంకటగిరి స్థానం కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. గతకొంతకాలంగా ఆయన వెంకటగిరి నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనను టార్గెట్ చేసుకునే ఆనం తాజా వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది.