SP Vijayarao: మేం అనుమతి ఇచ్చిన ప్రాంతాన్ని దాటి చంద్రబాబు ముందుకు వెళ్లారు: జిల్లా ఎస్పీ విజయరావు
- కందుకూరులో చంద్రబాబు సభలో విషాదం
- తొక్కిసలాటలో 8 మంది మృతి
- పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడన్న ఎస్పీ విజయరావు
- 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశామని వెల్లడి
- ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా డీఎస్పీ ర్యాంకు అధికారి
కందుకూరు టీడీపీ సభలో 8 మంది కార్యకర్తలు మరణించిన ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు స్పందించారు. కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు సభ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారని, అయితే తాము అనుమతి ఇచ్చిన ప్రాంతం కంటే చంద్రబాబు 46 మీటర్లు ముందుకు వెళ్లిపోయారని వెల్లడించారు.
తాము అనుమతి ఇచ్చిన ప్రాంతంలో తొక్కిసలాటకు అవకాశం ఉండేది కాదని, చంద్రబాబు ఇరుకుగా ఉన్న రోడ్డులోకి వెళ్లడంతో విపరీతమైన రద్దీ ఏర్పడిందని ఎస్పీ వివరించారు. జనం ఒక్కసారిగా నెట్టుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
ఈ ఘటనలో పిచ్చయ్య అనే వ్యక్తి గాయపడ్డాడని, అతడి ఫిర్యాదు ఆధారంగా 174 సీఆర్పీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. విచారణ అధికారిగా డీఎస్పీ ర్యాంకు అధికారిని నియమిస్తామని చెప్పారు.
టెక్నికల్ సాక్ష్యాధారాలు, డిజిటల్ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని చార్జిషీటు దాఖలు చేస్తామని వివరించారు. ఏదేమైనా ఇది దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు.