Sajjala Ramakrishna Reddy: జనం బాగా వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు: సజ్జల
- కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట
- 8 మంది మృత్యువాత
- చంద్రబాబు వికృత చర్యల్లో ఇదొక నరబలి అన్న సజ్జల
- చంద్రబాబులో పశ్చాత్తాపమే లేదని విమర్శలు
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో విషాద ఘటన చోటుచేసుకోవడం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
కందుకూరు ఘటనకు చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. సభకు జనం బాగా వచ్చారని చంద్రబాబు పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. డ్రోన్ షాట్లతో జనం బాగా వచ్చారని నిరూపించుకునేందుకు ప్రయత్నించారని వివరించారు. పోలీసుల సూచనలు పాటించకుండా, అనుమతించిన ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ నిర్వహించారని తెలిపారు. కావాలనే ఇరుకు రోడ్డులో సభ నిర్వహించి, ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కందుకూరు ఘటన పట్ల చంద్రబాబులో పశ్చాత్తాపమే కనిపించడంలేదని సజ్జల అన్నారు. చంద్రబాబు వికృత చర్యల్లో ఇదొక నరబలి అని అభివర్ణించారు. ఈ విషాద ఘటనను కూడా విపక్ష నేత తనకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.