KA Paaaaaul: చంద్రబాబు సభలకు అనుమతి రద్దు చేయాలంటూ డీజీపీ ఆఫీసుకు వచ్చిన కేఏ పాల్
- చంద్రబాబు కందుకూరు సభలో విషాదం
- తొక్కిసలాటతో 8 మంది మృతి
- చంద్రబాబు ఎలా సభలు పెడతారన్న కేఏ పాల్
- విచారణ పూర్తయ్యే వరకు సభలకు అనుమతి ఇవ్వొద్దని డిమాండ్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నేడు ఏపీ డీజీపీ కార్యాలయానికి విచ్చేశారు. కందుకూరు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించిన నేపథ్యంలో... టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు అనుమతి రద్దు చేయాలని డీజీపీని కోరేందుకు కేఏ పాల్ ప్రయత్నించారు. అయితే, ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంతో డీజీపీ కార్యాలయం వెలుపలే వాహనంలో కూర్చుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కందుకూరు ఘటనపై కేసు విచారణ పూర్తయ్యేవరకు చంద్రబాబు సభలు, రోడ్ షోలు నిర్వహించకుండా అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 5 వేల నుంచి 10 వేల మంది పట్టే రోడ్డులో 50 వేల మంది సభ ఎలా పెడతారని, ఎందుకు అనుమతి ఇచ్చారని కేఏ పాల్ ప్రశ్నించారు. బిర్యానీ పొట్లాలు, మద్యం, డబ్బు ఇచ్చి ప్రజలను తీసుకొచ్చి చంపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కొడుకు, మనవడికి ఇలా జరిగితే సభలు పెడతారా? అని నిలదీశారు. చంద్రబాబు మనవడికి నలుగురు గన్ మన్లు ఎందుకని ప్రశ్నించారు.
కాగా, కేఏ పాల్ కందుకూరు ఘటనపై ఇప్పటికే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఏదైనా గ్రౌండ్ లో ఏర్పాటు చేయాల్సిన సభను ఇరుకు రోడ్డులో ఏర్పాటు చేశారని, దీనిపై పూర్తిగా విచారణ జరిపించాలని నిన్న డిమాండ్ చేశారు.