Uttar Pradesh: తలుపులు, గోడలు లేకుండానే మరుగుదొడ్లు.. విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం
- ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఘటన
- నాలుగు టాయిలెట్లను ఒకదాని పక్కన మరోటి కట్టేసిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు
- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
యూపీలోని బస్తీ జిల్లాలోని ధన్సా గ్రామంలో ఇటీవల నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తలుపులు, గోడలు లేకుండానే నాలుగు మరుగుదొడ్లను ఒకదాని పక్కన ఒకటి నిర్మించారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన ఈ మరుగుదొడ్ల ఫొటోలు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్మిస్తారంటూ దుమ్మెత్తి పోశారు. దీంతో స్పందించిన పంచాయతీ రాజ్ అధికారులు వాటిని పగలగొట్టి ధ్వంసం చేసి వివాదానికి అక్కడితో ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
ధన్సా గ్రామంలోని రుధౌలి బ్లాక్‌లో నిర్మించిన మరుగుదొడ్ల విషయంలో నిబంధనలు పాటించలేదని అభివృద్ధి విభాగం ముఖ్య అధికారి రాజేశ్ ప్రజాపతి తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారుల దర్యాప్తు నివేదిక అందాక తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టాయిలెట్లు నిర్మించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.