Gujarat: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. కారుపైకి దూసుకెళ్లిన బస్సు.. 9 మంది దుర్మరణం
- గుజరాత్‌లోని నవసారి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘటన
- కారులోని 9 మందిలో 8 మంది మృతి
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
గుజరాత్‌లోని నవసారి జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. సూరత్‌లోని ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమం నుంచి వల్సాద్ వెళ్తున్న లగ్జరీ బస్సు.. నవసారి జాతీయ రహదారిపై అదుపుతప్పి టొయోటా ఫార్చునర్ కారుపైకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు నియంత్రణ కోల్పోయి కారుపైకి దూసుకెళ్లింది. ప్రమాదం అనంతరం డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
ప్రమాదంలో కారులో ఉన్న 9 మందిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న బస్సులోని 28 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 11 మందిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెస్మా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు నవసారి ఎస్పీ రుషికేశ్ ఉపాధ్యాయ్ తెలిపారు. మృతులు గుజరాత్‌లోని అంకలేశ్వర్‌కు చెందినవారని పేర్కొన్నారు. వల్సాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం బారినపడినట్టు చెప్పారు. బస్సులోని ప్రయాణికులు వల్సాద్‌కు చెందినవారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కాగా, అహ్మదాబాద్‌లో ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమాన్ని డిసెంబరు 14న ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు.