kamalnath: 2024 ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ..! : కమల్ నాథ్
- గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందన్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం
- పదవుల కోసం కాదు.. ప్రజల కోసమే రాహుల్ రాజకీయం
- పార్టీని మోసం చేసిన సింధియాకు కాంగ్రెస్ లో చోటులేదని వెల్లడి
వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ సంచలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారని చెప్పారు. ఆయనకన్నా మంచి ప్రధాని అభ్యర్థి మరొకరు లేరని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఆయననే తమ క్యాండిడేట్ గా ముందు నిలబెడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కమల్ నాథ్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద పాదయాత్రను మరే నాయకుడూ చేపట్టలేదని అన్నారు.
రాహుల్ గాంధీ పదవుల కోసం, పవర్ కోసం రాజకీయాలు చేయరని కమల్ నాథ్ చెప్పారు. పదవులు, పవర్ ను కట్టబెట్టే ప్రజల కోసమే ఆయన ఆరాటపడతారని వివరించారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, వారి కుటుంబంలాగా త్యాగం చేసిన మరో కుటుంబం దేశంలోనే లేదని పొగడ్తలు కురిపించారు. కాగా, కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా తిరిగొచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ప్రత్యేకంగా పేర్లు ప్రస్తావించడం ఇష్టంలేదని, అయితే పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వారికి కాంగ్రెస్ లో చోటులేదని కమల్ నాథ్ స్పష్టంచేశారు.