standing: రోజులో కొద్ది సమయం నించునే వారికి దీర్ఘాయుష్షు!
- నించోవడం వల్ల కండరాలకు బలం
- జీవిత కాలంపై దీని ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు
- రోజువారీ కొన్ని పనులను నించుని చేస్తే సరి
అస్తమానం కూర్చునే ఉండడం వల్ల ఆరోగ్యానికి నష్టమే కానీ, వచ్చే లాభాలేమీ లేవు. నేటి జీవనశైలి వ్యాధుల్లో కొన్ని ఇలా గంటల తరబడి కూర్చుని ఉండడం వల్ల వస్తున్నవే. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, వెన్ను సంబంధిత సమస్యలు, సంతాన లేమి వీటన్నింటిపై అధిక సమయం పాటు కూర్చోవడం వల్ల పడే ప్రభావం ఎంతో ఉంటుంది. అందుకే ప్రతి అరగంటకు ఓసారి లేదంటే గంటకు ఒకసారి అయినా 2-3 నిమిషాల పాటు లేచి నడవాలన్నది వైద్యుల సూచన.
ఎక్కువ సమయం పాటు నించోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాళ్ల నొప్పులు తప్ప! అని అనుకోవద్దు. రోజులో కొంత సమయం పాటు నించుని ఉండడం వల్ల ఎక్కువ కాలం జీవించొచ్చని వైద్యులు అంటున్నారు. అమెరికాలోని క్లెవెలాండ్ లో క్లెవెలాండ్ క్లినిక్ స్పోర్ట్స్ హెల్త్ కు చెందిన ఎక్సర్ సైజ్ ఫిజియాలజిస్ట్ క్రిస్టోఫర్ ట్రావెర్స్ ఇదే చెబుతున్నారు. కనీసం రోజులో మూడు గంటల పాటు నించుని ఉండాలన్నది ఆయన సూచన.
‘‘కూర్చుని ఉండడంతో పోలిస్తే, నుంచోవడం అనేది మన జీవిత కాలంపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ఇందులో ముఖ్యమైన ప్రయోజనం కండరాల కదలిక ఒకటి. దీనివల్ల కండరాలు బలోపేతం అవుతాయి. చక్కెరలతో వచ్చే కేలరీలు కరిగిపోతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుంది’’ అని న్యూయార్క్ లోని డీన్ క్రాష్ ఫిట్ కు చెందిన మేలార్డ్ హోవెల్ పేర్కొన్నారు.
నించుని ఉండడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలన్నది వీరి సూచన. ఎవరికి కావాల్సిన నీరు వారే వెళ్లి తాగడం, టీ లేదా కాఫీ నించుని తాగడం, ఎక్కడైనా వేచి ఉండాల్సి వస్తే నించోవడం, ఫోన్ కాల్ నించుని లేదా అటూ ఇటూ నడుస్తూ మాట్లాడడం ఇలాంటి చర్యలతో నించునే సమయాన్ని పెంచుకోవచ్చు. వీలుంటే నించుని పని చేసే విధంగా డెస్క్ ఏర్పాటు చేసుకోవచ్చన్నది మరో సలహా. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతుందని అంటున్నారు. అంతేకాదు నిత్యం గంట పాటు నడవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.