IPL 2023: ఐపీఎల్ జట్లలో ఇక మీదట 11 కాదు.. 12 మంది!
- 2023 సీజన్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమలు
- తుది 11 మంది ఆటగాళ్లకు అదనంగా మరో ప్లేయర్
- టాస్ సమయంలోనే ప్రత్యామ్నాయ ఆటగాళ్ల గురించి ప్రకటించాలి
2023 ఐపీఎల్ సీజన్ లో జట్ల జయాపజయాల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ కీలక పాత్ర పోషించనుంది. ప్రతి జట్టు 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగడం సాధారణమే. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అవసరమైతే మరో ఆటగాడితో ఆడించే వెసులుబాటు ఉంటుంది. గత సీజన్లలో అన్ని ఫ్రాంచైజీలు మ్యాచ్ కు ముందు తుది 11 మందితో కూడిన జట్టును ప్రకటించాల్సి ఉండేది. ఆ 11 మందినే ఆడటానికి అనుమతించే వారు.
కానీ, 2023లో అలా కాదు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల జట్లు 12 మందితో ఆడొచ్చు. టాస్ సమయంలో ప్రతీ జట్టు 11 మంది సభ్యులతో తుది జట్టును వెల్లడించాలి. అలాగే, మరో నలుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల పేర్లనూ అప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నలుగురి నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ (ప్రభావం చూపే ఆటగాడు)ను కెప్టెన్ ఎంపిక చేసుకోవచ్చు.
ఇంపాక్ట్ ప్లేయర్ ఎప్పుడైనా బ్యాటింగ్ కు దిగొచ్చు. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ చేయవచ్చు. జట్టులో ఏ స్థానంలో అయినా రావచ్చు. ప్రత్యామ్నాయంగా ప్రకటించే నలుగురూ విదేశీ ఆటగాళ్లు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ కు అవకాశం ఉండదు. భారత ఆటగాడినే ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవాలి. కనుక నలుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్లలో ఒకరైనా భారత ఆటగాడు ఉండాలి. ఆల్ రౌండర్ల కొరతను ఎదుర్కొంటున్న జట్లకు ఇది ఉపకరించనుంది. అలాంటి జట్లు ఏడుగురు బ్యాట్స్ మెన్, ఐదుగురు బౌలర్లను తీసుకోగలవు.