bus driver: రిషబ్ పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్ కు ప్రశంసలు
- ప్రశంసా పత్రం, షీల్డ్ బహూకరించి సత్కారం
- మానవత్వానికి నిదర్శనంగా పేర్కొన్న హర్యానా మంత్రి
- ప్రభుత్వం తరఫున ప్రశంసలు
ప్రముఖ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడానికి సాయపడిన బస్సు డ్రైవర్ కు చక్కని ప్రశంసలు లభిస్తున్నాయి. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొని దగ్ధమైపోవడం తెలిసిందే. ఈ సమయంలో పంత్ స్వయంగా కారు నడుపుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డోర్ విండోని బద్దలుకొట్టుకుని బయటకు వచ్చేందుకు పంత్ ప్రయత్నించాడు. కానీ, మధ్యలోనే ఇరుక్కుపోయాడు.
శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పంత్ కారు వెనుకే వస్తున్న హర్యానా రాష్ట్ర రోడ్ వేస్ బస్సు డ్రైవర్.. కారు ప్రమాదాన్ని గమనించి వెంటనే బస్సు నిలిపివేశాడు. కండక్టర్ తో కలసి కిందకు దిగి వెళ్లి చూడగా, ఓ వ్యక్తి కారు డోర్ విండోలో ఇరుక్కుని ఉండడం చూసి బయటకు తీసి రక్షించారు.
పంత్ ను కాపాడిన బస్సు డ్రైవర్ సుశీల్, కండక్టర్ పరమ్ జీత్ కు హర్యానా రోడ్ వేస్ అధికారులు ప్రశంసా పత్రాలు, షీల్డ్ ను బహూకరించి, వారిని అభినందించారు. మానవత్వానికి వీరు (డ్రైవర్, కండక్టర్) నిదర్శనమని హర్యానా రాష్ట్ర రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరిని ప్రశంసించింది.