Chandrababu: జగన్ ఎన్ని చేసినా ప్రజలు అన్ స్టాపబుల్... టీడీపీ అన్ స్టాపబుల్... మాకు అధికారం అన్ స్టాపబుల్!: చంద్రబాబు
- కోవూరులో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు
- ప్రజలు తమవైపే ఉన్నారని వెల్లడి
- వచ్చే ఎన్నికల్లో తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా
- మంచి నేతలు పార్టీలోకి వస్తే తీసుకుంటామని వివరణ
టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కోవూరులో మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమవైపే ఉన్నారని స్పష్టం చేశారు. జగన్ ఓటుకు రూ.10 వేలు ఇస్తాడట... ఎన్ని చేసినా ప్రజలు అన్ స్టాపబుల్... టీడీపీ అన్ స్టాపబుల్... మాకు అధికారం అన్ స్టాపబుల్! అని అన్నారు.
ఇక, మంచి వాళ్లు ఇతర పార్టీల నుంచి వస్తే తీసుకోవడంలో తప్పులేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంపై నిబద్ధత ఉండే మంచి నేతలను తీసుకుంటామని, అయితే, పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లను మరిచిపోమని స్పష్టం చేశారు. పార్టీలో వారికి ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.
తెలుగు జాతి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా... తెలుగుదేశంపార్టీ తెలుగువారి కోసం పెట్టిన పార్టీ" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా మరికొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు.
"జగన్ అజ్ఞానానికి, అమాకత్వానికి ఏం చెబుతాం? గోపీచంద్ అకాడమీకి స్థలం ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చిన 5 ఎకరాల్లో పెట్టిన అకాడమీలో సింధు ఆట నేర్చుకుందన్న విషయాన్ని జగన్ తెలుసుకోవాలి. కోవూరులో 100 ఎకరాల్లో మూడు వేల కోట్లతో మిధాని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇక్కడ యువతకు ఉద్యోగావకాశాలు వచ్చేవి.
రామాయపట్నం పోర్టును ఎందుకు రద్దు చేశారు.? పోర్టులు ఎందుకు చేతులు మారాయి... భూములు ఎందుకు చేతులు మారాయి? 2,400 మెగావాట్లు ఉన్న ఏపీ జెన్ కో ప్రాజెక్టును కూడా ప్రైవేటుపరం చేస్తున్నాడు. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. నాడు కొన్ని అరాచకాలు జరిగాయి... మాకు ఉన్న సమాచారం ఆధారంగా కొంతమందిపై చర్యలు తీసుకున్నాం" అని చంద్రబాబు వెల్లడించారు.