Anjani Kumar: సీఎం కేసీఆర్ ను కలిసిన నూతన డీజీపీ అంజనీకుమార్
- తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్
- రాష్ట్ర పోలీస్ బాస్ గా నేడు బాధ్యతల స్వీకరణ
- ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన వైనం
తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో అంజనీకుమార్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. అంజనీకుమార్ ఇవాళ డీజీపీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర పోలీస్ బాస్ గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి అంజనీకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్... కొత్త డీజీపీ అంజనీకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అంజనీకుమార్ 1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. తొలుత ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో పదోన్నతిపై ఎస్పీ అయ్యారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీగా పనిచేశారు.
అంతేకాదు, గ్రేహౌండ్స్ చీఫ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గానూ వ్యవహరించారు. నిజామాబాద్ రేంజి డీఐజీగా, వరంగల్ ఐజీగా పనిచేశారు. హైదరాబాద్ ఏసీపీగా, సీపీగానూ వ్యవహరించారు. డీజీపీ పదవి చేపట్టడానికి ముందు అంజనీకుమార్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు.
అంజనీకుమార్ రెండు పర్యాయాలు ఐక్యరాజ్యసమితి శాంతి పతకం అందుకోవడం విశేషం. ఆయన 1998లో ఐరాస శాంతి పరిరక్షక దళానికి ఎంపికయ్యారు. సమస్యాత్మక బోస్నియా-హెర్జిగోవినాలో ఏడాదిపాటు విధులు నిర్వర్తించారు.