Movies: 2023లోనూ దక్షిణాది హీరోల హంగామా కొనసాగేనా...?
- 2022లో బ్లాక్ బస్టర్ హిట్లు
- కలెక్షన్ల వర్షం కురిపించిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2
- బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా విజయాలు
- 2023లోనూ పెద్ద హీరోల సినిమాలు
దక్షిణాది సినీ పరిశ్రమకు 2022 మరపురాని ఏడాదిగా మిగిలిపోతుంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి చిత్రాలు బాలీవుడ్ ను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. విలువల పరంగా ఉన్నతస్థాయిలో ఉండడమే కాదు, కలెక్షన్ల విషయంలోనూ రికార్డుల మోత మోగించాయి. బ్లాక్ బస్టర్ చిత్రాలకు సిసలైన నిదర్శనంలా నిలిచాయి. ఇక చిన్న చిత్రంగా వచ్చిన 'కాంతార' సంచలన విజయం సాధించడం చూసి ఉత్తరాది సినీ వర్గాలు నోరెళ్లబెట్టి చూశాయి.
2023లోనూ దక్షిణాది హీరోల నుంచి భారీ చిత్రాలు రానున్నాయి. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ప్రభాస్ నటించిన సలార్ (పాన్ ఇండియా), ఆదిపురుష్(తెలుగు/హిందీ), నాని దసరా, కోలీవుడ్ నుంచి రజనీకాంత్ జైలర్, విజయ్ వారిసు, అజిత్ కుమార్ నటించిన తునివు, మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్-2, కన్నడ చిత్రసీమ నుంచి దర్శన్ నటించిన క్రాంతి చిత్రాలు 2023లో విడుదల కానున్నాయి.
వీటిలో వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా, వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కన్నడ చిత్రం క్రాంతి జనవరి 26న రిలీజవుతోంది. నాని హీరోగా తెరకెక్కిన దసరా చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. రజనీకాంత్ జైలర్ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం వాస్తవానికి జనవరి 12నే విడుదల కావాల్సి ఉన్నా, టీజర్ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రం విడుదలను జూన్ 16కి వాయిదా వేశారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సెప్టెంబరు 28న విడుదలవుతోంది.