India: అణుకేంద్రాల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాకిస్థాన్
- అణుదేశాలుగా కొనసాగుతున్న భారత్, పాకిస్థాన్
- ఒకరి అణుకేంద్రాలపై ఒకరు దాడి చేసుకోవడంపై నిషేధం
- 1988లో ద్వైపాక్షిక ఒప్పందం
- 1991 నుంచి అమలు
దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ రెండు అణుదేశాలే. భద్రత కోసమంటూ ఇరుదేశాలు అణ్వస్త్రాలను రూపొందించుకున్నాయి. అయితే, పరస్పర విశ్వాసం కోసం గత 32 ఏళ్లుగా భారత్, పాకిస్థాన్ తమ అణుకేంద్రాల జాబితాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో, ఈ ఏడాది కూడా తమ అణుకేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్నాయి.
ఒకరి అణుకేంద్రాలపై మరొకరు దాడి చేసుకోకుండా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జాబితా మార్పిడి ఆనవాయతీ కొనసాగుతోంది. ఢిల్లీ, ఇస్లామాబాద్ లోని దౌత్య కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ జాబితాల మార్పిడి జరిగింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య అణుకేంద్రాలపై దాడి నిషేధం ఒప్పందం 1988 డిసెంబరు 31న కుదిరింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం 1991 జనవరి 27 నుంచి అమలవుతోంది.