Andhra Pradesh: నేడు బీఆర్ఎస్‌లోకి పలువురు ఏపీ నేతలు.. తోట చంద్రశేఖర్‌ను ఏపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం!

AP Leaders Today To Join BRS In Telangana Bhavan

  • ఏపీలోనూ కాలుమోపుతున్న ‘బీఆర్ఎస్’
  • తోట చంద్రశేఖర్‌, రావెల కిశోర్‌బాబు సహా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్న పలువురు ఏపీ నేతలు
  • తెలంగాణ భవన్‌లో కండువాలు కప్పుకోనున్న నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు నేడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్‌తోపాటు మాజీ మంత్రి, ఐఆర్‌టీఎస్ మాజీ అధికారి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజే ప్రకాశ్‌తోపాటు పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వీరంతా పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. 

తోట చంద్రశేఖర్‌కు ఏపీ పగ్గాలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా 23 ఏళ్లపాటు పనిచేసిన తోట చంద్రశేఖర్ 2009లో పదవికి రాజీనామా చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ స్థానానికి, 2019లో జనసేన నుంచి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

ఇక, రావెల కిశోర్‌‌బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 2019లో జనసేనలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి కొంతకాలానికే ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు.  

మరో నేత చింతల పార్థసారథి కూడా ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి 2019లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన తుమ్మలశెట్టి జయప్రకాశ్ నారాయణ (టీజే ప్రకాశ్) 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అనంతపురం నగర నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

  • Loading...

More Telugu News