New Delhi: భర్త అయినా సరే.. భార్య నగలు తీసుకోవడం నేరమే: ఢిల్లీ హైకోర్టు
- భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అన్న హైకోర్టు
- మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరణ
- భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టొద్దని ఆదేశం
పెళ్లయినంత మాత్రాన భార్యపై సర్వహక్కులు ఉన్నట్టు భావించకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య నగలను చోరీ చేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అని, భర్త అయినా వాటిపై కన్నేయడం నేరమేనని జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.
భర్త తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టడం, అపహరించిన నగలను తీసుకెళ్లడం చేయొద్దని ఆదేశించింది. కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉందన్న కోర్టు.. నిందితుడు అధికారులకు సహకరించడం లేదని, అపహరణకు గురైన నగలను తిరిగి ఇవ్వడం జరగలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిలు మంజూరు చేసి, పిటిషన్ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది.