Ch Malla Reddy: ఏపీలో బీఆర్ఎస్ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది.. గెలిచేది మేమే: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి
- ఏపీ నేతలు పోలవరంను పూర్తి చేయలేకపోయారన్న మల్లారెడ్డి
- బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని వ్యాఖ్య
- బీఆర్ఎస్ కు ఏపీలో మంచి స్పందన వస్తోందన్న మంత్రి
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ తన కార్యాచరణను మొదలు పెట్టబోతోంది. ఇప్పటికే ఏపీలో పార్టీ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. మరోవైపు, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు.
ఏపీలో నేతలు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని అన్నారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అంతే వేగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని మల్లారెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎనిమిది నెలల కాలంలో తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని దేశ ప్రజలందరూ చూస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా స్పందన లభిస్తోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. ఏపీలో బీఆర్ఎస్ విజయం సాధించడం కూడా ఖాయమని చెప్పారు. మరోవైపు కేసీఆర్ సమక్షంలో ఈరోజు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.