blast in kasmir: కశ్మీర్ లో నిన్న ఎన్ కౌంటర్ జరిగిన చోటే ఈరోజు పేలుడు
- చిన్నారి మృతి, ఐదుగురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు
- రాజౌరీ జిల్లాలోని డాంగిరి గ్రామంలో ఘటన
- ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదుల హతం
ముందురోజు భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలోనే పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా డాంగిరీ గ్రామంలో సోమవారం నాడు జరిగిందీ ఘటన. కొత్త సంవత్సరం తొలిరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
ఆదివారం డాంగిరీ గ్రామంలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఊరిలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకునేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్ ఎన్ కౌంటర్ కు దారితీసింది. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు నలుగురినీ భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. సోమవారం అదే ఇంటికి దగ్గర్లో పేలుడు జరిగింది. ఘటనాస్థలంలో మరో ఐఈడీ బాంబును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
పేలుడు ఘటనలో చిన్నారి మరణించడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రజలను కాపాడడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. రాజౌరీలో భారీగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్వయంగా వచ్చి, తమ డిమాండ్లను వినాలని, అప్పటి వరకు ఆందోళన ఆపేదిలేదని నిరసనకారులు తేల్చిచెప్పారు.