Team India: ప్లీజ్.. పంత్ ను చూసేందుకు ఎవరూ రావొద్దు: వైద్యులు
- ప్రమాదానికి గురైన పంత్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వస్తున్న ప్రముఖులు
- విజిటింగ్ సమయం దాటినా తరచూ ఎవరో ఒకరి రాక
- ఈ కారణంగా క్రికెటర్ కు విశ్రాంతి లభించడం లేదంటున్న వైద్యులు, కుటుంబం
కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సకాలంలో ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అత్యవసర విభాగం నుంచి నుంచి వార్డ్ కు తరలించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆసుపత్రిలో ఉన్న పంత్ కు కొత్త సమస్య వచ్చింది. దీని వల్ల అతడితో పాటు కుటుంబ సభ్యులు తెగ ఇబ్బంది పడుతున్నారు. పంత్ ను చూసేందుకు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి క్యూకడుతున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, పంత్ ని ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. విజిటింగ్ అవర్స్ లెక్క చేయకుండా పలువురు పంత్ ని పరామర్శిస్తున్నారు.
అయితే, వారి వల్ల పంత్ కు సరైన విశ్రాంతి లభించడం లేదని అటు వైద్యులు, ఇటు అతని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సమయంలో పంత్ త్వరగా కోలుకోవాలంటే అతనికి తగిన విశ్రాంతి అవసరం అని వైద్యులు చెబుతున్నారు. ‘శారీరకంగానే కాకుండా మానసికంగానూ పంత్ కు విశ్రాంతి అవసరం. ప్రమాదంలో గాయాల కారణంగా ఇప్పటికీ అతడికి నొప్పులున్నాయి. పరామర్శించడానికి వచ్చిన వారితో మాట్లాడుతుండటం వల్ల అతడి ఎనర్జీ తగ్గిపోతోంది. కొన్నాళ్లు ఎవ్వరూ చూడటానికి రావొద్దు. దానివల్ల పంత్ కు తగిన విశ్రాంతి దొరుకుతుంది’ అని అతనికి చికిత్స చేస్తున్న వైద్యులు చెప్పారు. ఇక డెహ్రాడూన్ ఆసుపత్రిలో పంత్ కి అందిస్తున్న చికిత్స పట్ల ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకైతే పంత్ ని ఇక్కడే ఉంచుతామని, డాక్టర్లతో బీసీసీఐ టచ్ లో ఉందని చెప్పారు.