Venkaiah Naidu: మళ్లీ రాజకీయాల్లోకి రాను, వాటిలో జోక్యం చేసుకోను: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- ముందే రిటైర్ అయిపోయానని అనిపిస్తోందన్న మాజీ ఉప రాష్ట్రపతి
- తెలుగు రాష్ట్రాల్లో బూతుల రాజకీయాలు పెరగడం, దిగజారుడుతాననికి పరాకాష్ఠ అని వ్యాఖ్య
- ఇలాంటి వాళ్లు గెలవకుండా ప్రజలే తీర్పు చెప్పాలని సూచించిన వెంకయ్య
తాను చాలా ముందుగా రిటైరైపోయానేమోనని అనిపిస్తోందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో తనకెలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి రానని, వాటిలో జోక్యం చేసుకోనని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బూతుల రాజకీయాలు పెరిగిపోవడంపై వెంకయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిణామాన్ని దిగజారుడుతనానికి పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. దీన్ని ప్రజలు గమనించాలన్నారు. ఇలాంటి భాష మాట్లాడే వారిని మళ్లీ గెలవనివ్వకుండా ప్రజలే తీర్పు చెప్పాలని ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో ఆకాక్షించారు.
ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. కేరక్టర్, కేలిబర్, కెపాసిటీ, కాండక్ట్ అనే నాలుగు ‘సీ’లు రాజకీయాల్లో ఉండాలని తాను తరచూ చెబుతుంటానని వెంకయ్య తెలిపారు. కానీ ఇప్పుడు క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ అనే నాలుగు ‘సీ’లు రాజకీయాల్లోకి వచ్చాయన్నారు. మొత్తం రాజకీయాలను ఇవే ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కులం పేరు చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు. కానీ అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేదని అన్నారు. ఇలాంటి రాజకీయం చేసేవాళ్లను ప్రజలు బ్యాలెట్ పేపరుతో ఓడించాలని, అప్పుడే వాళ్లు కళ్లు తెరుస్తారని అభిప్రాయపడ్డారు.
ఇక, తనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులపై ఏ మాత్రం ఆసక్తి లేదని వెంకయ్య స్పష్టం చేశారు. మోదీ నాయకత్వం అంటే తనకు బాగా ఇష్టమని, ఆ నాయకత్వం దేశానికి అవసరమని అన్నారు. గోవాలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఎల్కే అద్వానీని కాదని తాను మోదీని ప్రతిపాదిస్తే చాలామంది ఆశ్చర్యపోయారన్నారు. దేశంలో సంస్కరణలు తేవాలన్నది తన ఆలోచన అని, మోదీ వాటిని తెస్తున్నారని చెప్పారు.