Telangana: చలికాలంలో ఉక్కపోత.. తెలంగాణలో వింత వాతావరణం.. కారణం ఇదే!
- డిసెంబర్ నెలలో సాధారణ ఉష్ణోగ్రతల నమోదు
- 12 జిల్లాల్లో డిసెంబర్ 31వ తేదీన 35 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
తెలంగాణలో వాతావరణంలో అనూహ్య మార్పు కలుగుతోంది. చలికాలంలో ఉక్కపోత ఏర్పడటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి డిసెంబర్ నెలలో నాలుగైదు రోజులు తప్ప మిగతా రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెలాఖరుకు వచ్చేసరికి ఉక్కపోతలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. చలికాలంలో నమోదు అవ్వాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఐదారు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో 12 జిల్లాల్లో.. డిసెంబరు 31న 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
దీంతో ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 35-40 మధ్య ఉంటే యెల్లో హెచ్చరిక జారీ చేస్తారు. జనవరిలోనే ఇలాంటి హెచ్చరిక జారీ చేయడంతో మున్ముందు ఎండలు ఎక్కువగా ఉండబోతున్నాయన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని, సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం అని అంటున్నారు. ఉత్తరాది నుంచి గాలులు వీయడం లేదని, ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ గాలులే ఎక్కువగా ఉండటంతో ఉష్ణోగత్రలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.