Nikhil: 10 రోజుల్లో 25 కోట్లు రాబట్టిన '18 పేజెస్'
- విభిన్న ప్రేమకథా చిత్రంగా '18 పేజెస్'
- ఈ నెల 23వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమా
- అనుభూతి ప్రధానంగా సాగే కథాకథనాలు
- సంక్రాంతి వరకూ వసూళ్ల జోరు సాగే ఛాన్స్
నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా '18 పేజెస్' సినిమా తెరకెక్కింది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి, సుకుమార్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. ఆయన కథను అందించిన ఈ సినిమాకి, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. క్రితం నెల 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి మార్కులను దక్కించుకుంది.
ఈ సినిమా విడుదలై నిన్నటితో 10 రోజులైంది. 'ధమాకా' వంటి మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ కి పోటీగా దిగిన ఈ క్లాసికల్ లవ్ స్టోరీ, ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో 25 కోట్లను రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
సాధారణంగా ప్రేమకథల్లో ప్రేమికుల తొందరపాటు కనిపిస్తుంది. హడావిడి మాటలు .. అరగంటకోసారి పాటలు దర్శనమిస్తూ ఉంటాయి. అందుకు భిన్నమైన కథ ఇది. ప్రేమలో కోరిక ఒక కోణమైతే .. అనుభూతి మరో కోణం. అనుభూతి ప్రధానంగా సాగడమే ఈ సినిమాలోని కొత్తదనానికి కారణం. పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలేవీ దగ్గర్లో లేకపోవడం వలన, సంక్రాంతి వరకూ ఈ సినిమా సందడి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.