Uyyuru Srinivasa Rao: గుంటూరు ఘటన నేపథ్యంలో ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్ట్!
- నిన్న గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
- ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
- తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి
- ఉయ్యూరు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు
గుంటూరులో నిన్న ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ జరగ్గా, తీవ్ర తొక్కిసలాటతో ముగ్గురు మహిళలు మృతి చెందడం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాసరావుపై పోలీసులు 304, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను ఇవాళ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విజయవాడలో ఏలూరు రోడ్ లోని ఓ హోటల్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఉయ్యూరు శ్రీనివాసరావు మొన్నటివరకు ఎన్నారై. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విదేశాల్లో ఐటీ నిపుణుడిగా పనిచేసిన శ్రీనివాసరావు కొంతకాలం కిందట స్వదేశానికి వచ్చేశారు. ఆయన గుంటూరులోనూ, హిందూపురంలోనూ అన్న క్యాంటీన్లు కూడా నిర్వహిస్తున్నారు.