Atchannaidu: గుంటూరు ఘటన జరిగిన వెంటనే మంత్రులు క్యూ కట్టడం అనుమానాలకు తావిస్తోంది: అచ్చెన్నాయుడు
- గుంటూరులో తొక్కిసలాట
- కుట్రకోణం ఉండొచ్చంటున్న టీడీపీ నేతలు
- వేలమంది వచ్చే ప్రాంతంలో వంద మంది పోలీసులు కూడా లేరన్న అచ్చెన్న
- తోపులాట వేళ పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఆరోపణ
గుంటూరు తొక్కిసలాట ఘటన, ఇటీవల కందుకూరు ఘటన వెనుక కుట్ర కోణం ఉండొచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు.
గుంటూరు ఘటనకు జగన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఉయ్యూరు ఫౌండేషన్ పోలీసుల అనుమతితోనే సభ ఏర్పాటు చేసిందని, కానీ వేలాది మంది జనం వచ్చే ప్రాంతంలో కనీసం వంద మంది పోలీసులు కూడా లేరని అచ్చెన్న విమర్శించారు. తోపులాట చోటుచేసుకున్న సమయంలో పోలీసులు కూడా సరిగా స్పందించలేదని ఆరోపించారు. పైగా, ఘటన జరిగిన వెంటనే మంత్రులు క్యూ కట్టడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
టీడీపీ పార్టీ కూడా సోషల్ మీడియాలో సీఎం జగన్ పై ధ్వజమెత్తింది. తొక్కిసలాటలు జరిగేలా చేసి చంద్రబాబును కారకుడిగా చేస్తున్నారని ఆరోపించింది. చనిపోలేదు... చంపేశారు అంటూ టీడీపీ ఓ ట్వీట్ లో పేర్కొంది.