Congress: 9 రోజుల తర్వాత నేడు యూపీ నుంచి ప్రారంభం కానున్న ‘భారత్ జోడో యాత్ర’

Rahul Gandhi Bharat Jodo Yatra Enters UP Today

  • 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యాత్ర
  • 26న శ్రీనగర్‌లో ముగియనున్న యాత్ర
  • ఆ తర్వాత ‘హాథ్ సే హాథ్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 9 రోజుల తర్వాత నేడు ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు కానుంది. గతేడాది సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 110 రోజుల్లో 3 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా గుండా సాగిన యాత్ర నేడు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్‌లో యాత్ర ముగుస్తుంది. ఓ రాజకీయ నాయకుడు ఇన్నివేల కిలోమీటర్లు, ఇంత సుదీర్ఘంగా యాత్ర చేపట్టడం దేశ రాజకీయ చరిత్రలోనే ఇది తొలిసారని కాంగ్రెస్ పేర్కొంది.

ఈ నెల 26న శ్రీనగర్‌లో యాత్ర ముగిసిన తర్వాత ‘హాథ్ సే హాథ్ జోడో’ (చేయి చేయి కలుపు) ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించనుంది. యాత్రకు సంబంధించిన సందేశాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ‘హాథ్ సే హాథ్ జోడో’ ప్రచార బాధ్యతలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేపట్టనున్నారు. దేశంలో మహిళలే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేబడుతున్నారు. 

ఈ కార్యక్రమం రెండు నెలలపాటు కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీ.. మహిళలతో కలిసి రాష్ట్ర రాజధానుల్లో పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించి భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రచారం చేస్తారని వేణుగోపాల్ పేర్కొన్నారు. అలాగే, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ప్రజలపై మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపై అది చూపిస్తున్న ప్రభావంపై ప్రియాంక గాంధీ మార్చిలో మహిళా కార్యకర్తలతో కలిసి యాత్రలు నిర్వహించనున్నారు. మహిళా సంబంధ సమస్యలను కూడా ఈ మార్చ్‌లో హైలైట్ చేస్తారు.

  • Loading...

More Telugu News