Public Meetings: రోడ్లపై రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం

AP Govt bans public meetings and rallies on roads

  • రహదారుల మార్జిన్లలో కూడా సభలు, ర్యాలీలపై నిషేధం
  • అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో కూడిన అనుమతి
  • ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న విపక్షాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలను నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారులు, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులు, రహదారుల మార్జిన్లలో సభలు, ర్యాలీలను అనుమతించబోమని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతిని ఇవ్వొచ్చని కొంత మినహాయింపును ఇచ్చింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. 

రోడ్లపై ర్యాలీలు, సభల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని... నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఉత్తర్వుల్లో హోంశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్టు తెలిపింది. రహదారులను ప్రజల రాకపోకలకు, సరుకు రవాణాకు మాత్రమే ఉపయోగించాలని... సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని జిల్లాల ఉన్నతాధికారులకు సూచింది. 

ఇటీవల జరిగిన రెండు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News