BJP: రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం: విజయశాంతి
- ఏపీలో జనసేనను, బీజేపీని నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారన్న విజయశాంతి
- బీఆర్ఎస్ లో చేరికలు పరిణామాలు ఇందుకు సంకేతాలని వ్యాఖ్య
- ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకు తెలుసని కామెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పేరిట ఏపీలో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఆంధ్రప్రదేశ్ లో జనసేనను, జనసేనతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలు ఇందుకు సంకేతాలు ఇస్తున్నయి. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే ఏపీలోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన అత్యంత బలమైన ఒక సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేయటానికి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దుష్ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని ఏపీతోపాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కునెట్టి వేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు అర్థం చేసుకుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసి, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం’ అని ఆమె హెచ్చరించారు.