Supreme Court: 1950 నుంచి సుప్రీంకోర్టు అన్ని తీర్పుల కాపీలు ఆన్ లైన్ లో ఉచితం
- 72 ఏళ్లలో 34,013 తీర్పు కాపీలు
- ఆన్ లైన్ లో అందరికీ అందుబాటులోకి
- ఈ సీఎస్ఆర్ ప్రాజెక్టును ప్రారంభించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్
సుప్రీంకోర్టు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గడిచిన 72 ఏళ్లలో సుప్రీంకోర్టు జారీ చేసిన 34,000 తీర్పుల ప్రతులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన ఈ-సీఎస్ఆర్ ప్రాజెక్ట్ ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. తీర్పుల డిజిటల్ కాపీలు ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యువ న్యాయవాదులకు ఇది అనుకూలంగా ఉంటుంది.
సుప్రీంకోర్టు వెబ్ సైట్ కు వెళితే అక్కడ ఈ-సీఎస్ఆర్ వెబ్ పోర్టల్ లింక్ ఉంటుందని చీఫ్ స్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. ముఖ్యంగా పరిశోధన చేసే యువ న్యాయవాదులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. భవిష్యత్తు అధునాతన భారత న్యాయ వ్యవస్థకు దీన్ని తొలి అడుగుగా పేర్కొన్నారు. ఎంతో దూరం ప్రయాణించి లైబ్రరీలో ఎన్నో పుస్తకాలను తిరగేయాల్సిన ఇబ్బంది ఈ ప్రాజెక్ట్ తో తప్పుతుందన్నారు. సుప్రీంకోర్టు ఎడిటోరియల్ విభాగం, అధికారులు కలసి 15 రోజుల వ్యవధిలోనే 34,013 తీర్పు కాపీలను డిజిటల్ గా మార్చడం గమనార్హం.