car hit: ఢిల్లీ కారు హిట్ కేసు.. బాధితురాలి శవ పంచనామా నివేదికలో కీలక వివరాలు
- జననాంగాల వద్ద ఎలాంటి గాయాల్లేవని పరీక్షలో వెల్లడి
- నేడు పోలీసుల చేతికి ఈ నివేదిక
- మృతిపై బాధితురాలి తల్లి సహా పలువురిలో అనుమానాలు
ఢిల్లీలో స్కూటర్ పై వెళుతున్న అంజలీసింగ్ అనే యువతిని ఓ కారు ఢీకొట్టి, కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన ఘటనలో బాధితురాలి పోస్ట్ మార్టమ్ నివేదిక బయటకు వచ్చింది. బాధితురాలి జననాంగాల వద్ద ఎలాంటి గాయాలు లేవని వెల్లడైంది. జనవరి 1న ఈ ప్రమాదం జరగడం తెలిసిందే. ఇది కేవలం కారు ఢీకొన్న కేసు మాత్రమే కాదంటూ అంజలీసింగ్ తల్లి సహా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో బాధితురాలి జననాంగాలపై ఎలాంటి గాయాల్లేవని వెల్లడి కావడం గమనార్హం. మౌలానా అజాద్ మెడికల్ కాలేజీ వైద్యుల బృందం ఈ పోస్ట్ మార్టమ్ నిర్వహించింది. ఈ నివేదిక ఈ రోజు పోలీసులకు అందనుంది. అవసరమైతే మళ్లీ పరీక్షించేందుకు వీలుగా కొన్ని నమూనాలను భద్రపరిచారు. బాధితురాలిపై లైంగిక దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాల్లేవని పోలీసులు లోగడే ప్రకటన చేశారు.
ఈవెంట్ మేనేజర్ గా పనిచేసే అంజలీసింగ్ (20), తన స్నేహితురాలు నిధితో కలసి న్యూ ఇయర్ పార్టీ ముగించుకుని అర్ధరాత్రి 1.30 సమయంలో ఇంటికి స్కూటర్ పై వెళుతుండగా మారుతి బాలెనా కారు ఢీకొట్టింది. కిందపడిపోయిన అంజలీసింగ్ కాలు కారు చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమెను 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అంజలీసింగ్ తో పాటు ఉన్న నిధి ఎలాంటి గాయాల్లేకుండా తప్పించుకుంది. కారులో ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. తామంతా తాగి ఉన్నామని, ప్రమాదం తర్వాత భయంతో వేగంగా కారును పోనిచ్చామని, మహిళను కారు ఈడ్చుకొస్తున్న విషయం తెలియదని వారు చెప్పడం గమనార్హం.