Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కలకలం.. మాణికం ఠాగూర్ రాజీనామా చేశారంటూ ప్రచారం!
- టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకున్న మాణికం ఠాగూర్
- టీ కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో ఠాగూర్ విఫలమయ్యారన్న ఆరోపణలు
- మాణికం రాజీనామా చేసి ఉంటే ఆ విషయం ఏఐసీసీ ద్వారా తెలుస్తుందంటున్న సీనియర్లు
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక సీనియర్లకు, జూనియర్లకు ఏమాత్రం పొసగడం లేదు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం సంతరించుకోలేకపోతోంది. అంతర్గత విభేదాలు ఆ పార్టీని రోజురోజుకు మరింత బలహీనపరుస్తున్న వేళ తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తన పదవికి రాజీనామా చేశారని, టీపీసీసీ వాట్సాప్ గ్రూపు నుంచి ఆయన బయటకు వచ్చేశారన్న ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారంపై మాణికం ఠాగూర్ స్పందించారు. టీ కాంగ్రెస్ నేతల వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకున్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే, గ్రూపు నుంచి ఎందుకు ఎగ్జిట్ అయిందీ కారణం మాత్రం చెప్పలేదు. ఏఐసీసీ వాట్సాప్ గ్రూపులో మాత్రం మాణికం ఠాగూర్ కొనసాగుతున్నట్టు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తెలిపారు. కాగా, మాణికం ఠాగూర్ విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో ఆయన విఫలమయ్యారని, సమస్య పెద్దదిగా మారడానికి ఆయనే కారణమన్న ఆరోపణలున్నాయి.
దీనికి తోడు ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ పీసీసీకి అనుకూలంగా ఏకపక్షంగా ఉంటాయని సీనియర్లు ఆరోపిస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్న ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూపు నుంచి బయటకు వచ్చారని చెబుతున్నారు. మరోవైపు, మాణికం ఠాగూరే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా కొనసాగుతున్నారని, ఆయన కనుక రాజీనామా చేసి ఉంటే ఏఐసీసీ నుంచి సమాచారం వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తెలిపారు.