Ram Gopal Varma: చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానం: రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు
- మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి సభలు ఎక్కడ పెట్టాలో తెలియదా? అని ప్రశ్న
- ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారని విమర్శ
- హిట్లర్, ముస్సోలిని తర్వాత అలాంటి వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని... ఆయనకు సొంత పబ్లిసిటీనే ముఖ్యమని అన్నారు. విశాలమైన ప్రాంతాల్లో సభ పెడితే, తక్కువ జనాలు వస్తే, తనకు పాప్యులారిటీ తగ్గిపోయిందనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారని విమర్శించారు.
హిట్లర్, ముస్సోలిని తర్వాత అలాంటి వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. తన కోసం ఇంత మంది వచ్చి ప్రాణాలు కూడా కోల్పోయారంటూ చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పారు. ప్రజలకు చంద్రన్న కానుకలు అంటూ బిస్కెట్లు వేసి వారి ప్రాణాలు బలిగొన్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును తొలిసారి మీరు అని కాకుండా నువ్వు అని సంబోధిస్తున్నానని చెప్పారు. మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి సభలు ఎక్కడ పెట్టాలో తెలియదా? అని వర్మ ప్రశ్నించారు.