chandrababu: జీవో నెంబర్ 1 తీసుకొచ్చి నాపైనే ప్రయోగించారు: చంద్రబాబు
- జగన్ పాదయాత్ర చేసినప్పుడు మేము అడ్డుకున్నామా? అన్న బాబు
- జగన్ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని వ్యాఖ్య
- సైకో పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి
గతంలో పాదయాత్రలను ఏ ప్రభుత్వం కూడా అడ్డుకున్న సందర్భాలే లేవని... జగన్ పాదయాత్ర చేసినప్పుడు తాము అడ్డుకున్నామా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొంత మంది పోలీసు అధికారులు వత్తాసు పలకడం సరికాదని అన్నారు. జీవో నెంబర్ 1ను తీసుకొచ్చి తనపైనే ప్రయోగించారని చెప్పారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని అన్నారు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని, తన చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లారని మండిపడ్డారు. తనపై కూడా కేసు పెట్టుకోవాలని... తాము పోలీసు వ్యవస్థపైనే కేసులు పెడతామని అన్నారు.
జగన్ పని అయిపోయిందని... అన్ని రంగాల్లో ఆయన ఫెయిల్ అయ్యారని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని... జగన్ సైకో పాలన పోవాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో కూడా రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఎస్జీ భద్రతలో ఉండే తాను పర్యటించే సమయంలో ఒక డీఎస్పీ కూడా తనతో పాటు ఉండాలని... ఇక్కడ డీఎస్పీ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తన వాహనాన్ని ఎందుకు తీసుకెళ్లారో ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారి ఎవరైనా చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పోలీసుల సహకారం కావాలని... కానీ కొందరు పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బయటవాళ్లు వచ్చి కుప్పంలో అరాచకాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిని అందరూ చూస్తారని చెప్పారు. తన నియోజకవర్గంలోనే తనను తిరగనివ్వడం లేదని అన్నారు.