Team India: నేడు శ్రీలంకతో భారత్​ రెండో టీ 20.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు విషమ పరీక్ష!

India takes on srilanka 2nd t20i today

  • తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో గట్టెక్కిన భారత్
  • కీలక సమయాల్లో పట్టు విడిచిన ఆతిథ్య జట్టు
  • రెండో మ్యాచ్ లో ఓపెనర్ గిల్, స్పిన్నర్ చహల్ పై ఫోకస్

కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో నూతన ఏడాది విజయంతో ఆరంభించిన భారత క్రికెట్ జట్టు అదే జోరుతో శ్రీలంకతో ఈ రోజు రాత్రి పూణెలో జరిగే రెండో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తద్వారా ఆఖరి మ్యాచ్‌ను ప్రయోగాలకు వేదికగా మార్చుకోవాలని ఆశిస్తోంది. అదే సమయంలో తొలి టీ20లో చేసిన కొన్ని పొరపాట్లను కూడా సరిదిద్దుకోవాలని కోరుకుంటోంది. 

మంగళవారం వాంఖడే స్టేడియంలో భారత్ రెండు పరుగుల తేడాతో ఆఖరి బంతికి గట్టెక్కింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించాల్సింది. కానీ, కీలక సమయాల్లో పట్టు విడిచి లంకకు పుంజుకునే అవకాశం కల్పించింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం జట్టుకు లాభిస్తుందని కెప్టెన్‌ పాండ్యా అంటున్నా.. సులువుగా గెలవాల్సిన మ్యాచ్ లో అలాంటి పరిస్థితిని కల్పించుకోవడం ఎందుకన్న ప్రశ్న వస్తోంది. 

ఈ నేపథ్యంలో పూణెలో ముందుగా పవర్‌ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంతో పాటు మిడిల్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేయడంపై భారత్ దృష్టి సారించనుంది. ఈ విషయంలో తొలి మ్యాచ్ లో నిరాశ పరిచిన ఓపెనర్ శుభ్ మన్ గిల్, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ పై అందరి దృష్టి ఉంది. తన తొలి టీ20లో గిల్‌ పవర్‌ ప్లేకు తగ్గట్టు ఆడలేక వికెట్‌ పారేసుకున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ రూపంలో మరో నాణ్యమైన ఓపెనర్‌ నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో అతను సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 

ఇక, జట్టులో ఏకైక ప్రధాన స్పిన్నర్ అయిన చహల్‌ వాంఖడేలో ఎక్కువ పరుగులు ఇచ్చుకోవడం వల్లే భారత్ విజయం కోసం చివరి బంతి దాకా పోరాడాల్సి వచ్చింది. టీ20 వరల్డ్‌ కప్‌లో బరిలోకి దిగే అవకాశం రాకపోవడంతో చహల్ డీలా పడ్డాడు. అయితే, ఇప్పుడు జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ ఉన్న దృష్ట్యా తన మార్కు చూపెట్టకపోతే చహల్‌ మొత్తం జట్టు నుంచి దూరం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సిరీస్ అతనికి కీలకం కానుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకునేందుకు శ్రీలంక సిద్ధమైంది. ఈ టీ20లో ఓడితే సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉండటంతో ఒత్తిడంతా ఆ జట్టుపైనే ఉంటుంది.

  • Loading...

More Telugu News