Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సలహాదారులపై హైకోర్టు సీరియస్.. అన్నీ తేలుస్తామని వ్యాఖ్య

AP High Court serious on govt advisors

  • ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏమిటని హైకోర్టు మండిపాటు
  • ఇలాగే వదిలేస్తే కలెక్టర్లు, ఎస్పీలకు కూడా సలహాదారులను నియమిస్తారని వ్యాఖ్య
  • సలహాదారుల వివరాలను ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం

ఏపీ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఇంతమంది సలహాదారులను నియమించుకోవడంపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. సలహాదారులకు సంబంధించి హైకోర్టులో సైతం కేసు నడుస్తోంది. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

సలహాదారుల నియామకాలను తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు... సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడుందని ప్రశ్నించింది. ముఖ్యమంత్రికి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలం కానీ... ప్రభుత్వ శాఖలకు కూడా సలహాదారులను నియమించడం ఏమిటని నిలదీసింది. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఐఏస్ అధికారుల కంటే గొప్ప సలహాలను ఇస్తారా? అని ప్రశ్నించింది.

ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగబద్ధమో, కాదో తేలుస్తామని చెప్పింది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఏయే అధికారాలు ఉన్నాయో కూడా తేలుస్తామని తెలిపింది. 

ఇప్పటి వరకు ఎంత మంది సలహాదారులు ఉన్నారు? శాఖల వారీగా ఎంత మందిని నియమించారు? సలహాదారుల నియామకాల్లో విధివిధానాలు ఏమిటనే వివరాలను తమ ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. ఒక పీఠాధిపతి సలహామేరకు జ్వాలాపురపు శ్రీకాంత్ ను దేవాదాయశాఖకు సలహాదారుగా నియమించామన్న అడ్వొకేట్ జనరల్ వివరణను కోర్టు తప్పుపట్టింది. పీఠాధిపతులు దేవాలయాలకు మాత్రమే పరిమితం కావాలని... వారు ఉన్నది ప్రభుత్వాలను నడపడానికి కాదని చెప్పింది. ఇష్టానుసారం సలహాదారులను నియమించడాన్ని సాధారణ విషయంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News