Proteins: ఈ ప్రొటీన్లు శరీరంలో తయారు కావు.. మనం తీసుకోవాల్సిందే
- మొత్తం 20 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి
- వీటిల్లో తొమ్మిదింటిని మన శరీరం తయారు చేసుకోలేదు
- ఆహారం రూపంలో వీటిని అందేలా చూసుకోవాలి
- పిస్తా, చేపలు, గుడ్లు, పప్పులు అవసరం
కండరాల నిర్మాణం, మరమ్మతులకు, వ్యాధి నిరోధక శక్తి బలోపేతం కావడానికి, ఆరోగ్యకరమైన బరువు కోసం ప్రొటీన్లు తప్పనిసరి. శిశువుల నుంచి, వృద్ధుల వరకు ఈ ప్రొటీన్ అవసరం. ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ రోజువారీ అవసరం. ఎవరికి వారు తమ శరీర బరువుకు తగ్గట్టు ఆ రోజు ప్రొటీన్లు అందేలా చూసుకోవాలి. పెద్దలకు సాధారణంగా 50-60 గ్రాముల మధ్య ప్రొటీన్ అవసరం.
కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రొటీన్ ఇవన్నీ మన శరీర జీవక్రియలకు ఎంతో అవసరమైనవి. కాకపోతే ఏవీ మోతాదుకు మించకుండా చూసుకోవాలి. శరీరానికి తగినంత ప్రొటీన్ అందించకపోతే అప్పుడు అమైనో యాసిడ్స్ లోపిస్తాయి. దీంతో కండరాల బలహీనత ఏర్పడుతుంది. శుష్కించిన వారిలా శరీరం సన్నగా మారుతుంది. అంతేకాదు, దీని ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి బలహీన పడుతుంది. ఎముకలు కూడా బలాన్ని కోల్పోతాయి.
ఎసెన్షియల్/నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్
20 రకాల అమైనో యాసిడ్స్ లో 9 అమైనో యాసిడ్స్ అన్నవి ఎసెన్షియల్ (ముఖ్యమైనవి). వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. కనుక వాటిని మనమే ఆహారం రూపంలో అందించాల్సి ఉంటుంది. మిగిలిన నాన్ అమైనో యాసిడ్స్ ను మన శరీరం తయారు చేసుకోగలదు. అంటే వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమైనో యాసిడ్స్ ను మన శరీరానికి అందించే ప్రొటీన్ ఫుడ్ ను తీసుకోవాలి.
పిస్తాలు
పిస్తా పప్పులు రుచిగా ఉండడమే కాదు, దండిగా పోషకాలున్నవి. రోజుకు 6 గ్రాముల పిస్తా పప్పు తినడం వల్ల తొమ్మిది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకు లభిస్తాయి. పైగా పిస్తాలోని 90 శాతం కొవ్వులు అన్ శాచురేటెడ్. ఇవి శరీరానికి హాని చేయనివి. అంతేకాదు, మూడు గ్రాముల ఫైబర్, ఫాస్ఫరస్, బీ6, థయమిన్ కూడా లభిస్తాయి.
గుడ్లు
గుడ్లలో ప్రొటీన్, కొలిన్, ఐయోడిన్, మరీ ముఖ్యంగా విటమిన్ డీ ఉంటుంది. ఒక పెద్ద సైజు కోడి గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అన్ని రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గుడ్డుతో లభిస్తాయి.
లెంటిల్స్
పప్పు ధాన్యాలు కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటి రూపంలోనూ ప్రొటీన్ అందుతుంది. అలాగే, ఫైబర్, ఫొలేట్, పొటాషియం కూడా పప్పుల రూపంలో లభిస్తాయి. అరకప్పు పప్పులో 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
చికెన్
85 గ్రాముల చికెన్ తింటే 26 గ్రాముల ప్రొటీన్ శరీరానికి అందుతుంది. ఇంకా ఇందులో ఉండే బీ12, కోలిన్ మెదడు వృద్ధికి, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి తోడ్పడతాయి.
యుగర్ట్
పెరుగులోనే ఇదొక రకం. 200 గ్రాముల పెరుగులో 20 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అన్ని రకాల అమైనో యాసిడ్స్ లభిస్తాయి.
చేపలు
85 గ్రాముల చేపల్లో 22 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
క్వినోవా
ఇది ప్లాంట్ ఆధారిత ప్రొటీన్ వనరు. ఇందులోనూ అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఫైబర్ తో పాటు, కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.