Bandi Sanjay: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత... బండి సంజయ్ అరెస్ట్
- మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతున్న రైతులు
- రైతులకు మద్దతుగా బండి సంజయ్ నిరసన
- కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తల యత్నం
- సంజయ్ ని తరలిస్తుండగా అడ్డుకున్న కార్యకర్తలు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి మునిసిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ జోన్ కు తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని వారు స్పష్టం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా రంగంలోకి దిగారు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆయన నిరసనకు దిగారు. కలెక్టర్ తో మాట్లాడేంత వరకు నిరసన వీడేదిలేదంటూ అక్కడే బైఠాయించారు. అక్కడికి భారీగా చేరుకున్న బీజేపీ కార్యర్తలు కలెక్టరేట్ లోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.
ఈ నేపథ్యంలో, పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసు వాహనంలోకి ఎక్కించి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
పోలీసు వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దాంతో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో ఓ పోలీసు వాహనం ధ్వంసమైంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.