joshimath: ఉత్తరాఖండ్ లో ఊరు కుంగిపోతోంది.. వీడియో ఇదిగో!
- జోషిమఠ్ లో రోడ్లు, బిల్డింగులకు పగుళ్లు
- శుక్రవారం కూలిపోయిన ఆలయం
- ప్రజల్లో భయాందోళన.. అప్రమత్తమైన అధికారులు
- 600 కుటుంబాలను తరలిస్తున్న ప్రభుత్వం
ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ పట్టణం నేలలోకి కుంగిపోతోంది. చిన్నపాటి కొండపై ఉన్న ఈ టౌన్ లో రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. బిల్డింగ్ లు బీటలు వారాయి. శుక్రవారం ఓ ఆలయం కూలిపోయింది. టౌన్ లోని ఓ హోటల్ బిల్డింగ్ పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పైకి ఒరిగింది. ఈ పరిణామాలతో అక్కడున్న ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మూటాముల్లె సర్దుకొని అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. డేంజర్ జోన్ లో ఉన్న 600 కుటుంబాలను తరలించేందుకు హెలికాఫ్టర్లను సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. శనివారం జోషిమఠ్ లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పర్యటిస్తారని తెలిపారు.
పురాతన కాలంలో ఓ పెద్ద పర్వతం నుంచి విడివడిన కొండచరియపై జోషిమఠ్ పట్టణం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. కొండచరియ కావడంతో ఇందులోని మట్టికి ఎక్కువ బరువు మోసే శక్తిలేదని అంటున్నారు. జోషిమఠ్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోడ్లు, ఇళ్లు, ప్రాజెక్టులు పెరుగుతూ వచ్చాయి. దీంతో నేలపై భారం పెరిగిపోయింది.
మురుగునీటి వ్యవస్థ కూడా సరిగా లేకపోవడం, గతంలో వచ్చిన వరదలకు నాలాలు పూడుకుపోవడంతో వాన నీళ్లతో పాటు ఇళ్ల నుంచి విడుదలవుతున్న నీళ్లు ఇక్కడి మట్టిలోనే ఇంకిపోతున్నాయి. దీనివల్ల మట్టి కరిగిపోయి నేల కుంగుతోందని, కాంక్రీట్ కట్టడాలకు పగుళ్లు వస్తున్నాయని నిపుణులు చెప్పారు.
జోషిమఠ్ కు ఈ పరిస్థితి రావడానికి ఎన్టీపీసీ చేపడుతున్న డెవలప్మెంట్ ప్రాజెక్టులే కారణమని స్థానికులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. బద్రీనాథ్ కోసం హెలాంగ్, మార్వాడి మధ్య ఎన్టీపీసీ నిర్మిస్తున్న టన్నెల్ తో పాటు బైపాస్ రోడ్డు నిర్మాణం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.